యష్టిమధూకం గురించి సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

    యష్టిమధూకమును సంస్కృతంలో యష్టిమధు, మధువల్లి, మధుస్రవ , మధుకా అని పిలుస్తారు . తెలుగులో అతిమధురం అని మరొక పేరు కలదు. ఆయుర్వేద షాపుల్లో సులభంగా లభిస్తుంది.

                యష్టిమధుకం క్షుపజాతి చెట్టు. ఇది హిమాలయాలలో , చైనా దేశములో , యూరప్ దక్షిణ ప్రాంతములో విశేషముగా లభించును.దీని ఆకులు చిన్నవిగా , గుండ్రముగా ఉండును. దీని పువ్వులు ఎరుపుగా ఉండును. దీని కాయలు పలచగా చిన్నవిగా ఉండును. యష్టిమధుకం నీటిలో పుట్టేది , మెట్ట ప్రాంతాలలో పుట్టేది అని రెండు రకాలుగా ఉండును. దీని చూర్ణం తియ్యగా ఉండును. ఇది దీని ఆకు మరువపు చెట్టు వలే గుండ్రముగా ఉండును. దీని కొమ్మలు, వేరు దళసరిగా ఉండి నార కలిగి ఉండును. పువ్వులు తెలుపుగా గుత్తులగుత్తులుగా ఉండును.

ఔషధోపయోగాలు  -

*  దీర్గాయుష్షుకి, ముసలితనం త్వరగా రాకుండా ఉండుటకు యష్టిమధూకం చూర్ణం ఒక స్పూన్ ప్రతినిత్యం పాలతో కలిపి తాగుచుండవలెను. రోగాలు రాకుండా చేయును .

*  గుండె ప్రదేశములో అయినను మర్మావయవముల ప్రదేశాలలో దెబ్బలు తగిలినప్పుడు మనిషి రోజురోజుకి మనిషి క్షీణించిపోవును. అటువంటి సమయాలలో శొంఠి , యష్టిమధుకం సమానంగా తీసుకుని కషాయం చేసుకుని తాగినను, లేదా పాలతో కలిపి తాగుచున్న శరీరం క్షీణించునట ఆగిపోవును.

*  గర్భిణి యొక్క గర్బము ఎదగకుండా ఉన్నను , గర్భము నందలి శిశువు ఎదగకుండా ఉన్నచో పాలల్లో యష్టిమధుకం చూర్ణం , పంచదార , నేలగుమ్మడి చూర్ణం కలిపి తాగుచున్న శుష్కించి ఉన్న గర్బం వృద్ధినొందుతూ గర్భములోని శిశువు ఎదుగును.

*  శరీరంలో వాతం పెరిగి రక్తము నందు దోషం కలుగ చేయును . ఈ విధమైన రక్తదోషం వల్ల అరచేతులు , అరికాళ్లలో నల్లటి మచ్చలు ఏర్పడి తిమ్మిరి , పోట్లు కలుగును.

*  పాండురోగముతో బాధపడువారు యష్టిమధూక చూర్ణమును గాని కషాయమును గాని తేనెతో కలిపి తాగుచున్న పాండురోగం నివర్తించును.

*  అంగము నుండి కాని ఆసనము నుంచి రక్తం పడుచున్నచో యష్టిమధుకం మరియు తేనె కలిపి లొపలికి ఇచ్చి వాంతి చేయించవలెను .

*  రక్తముతో కూడిన వాంతులు అవుచున్న యష్టిమధుకం , మంచిగంధం పాలతో మెత్తగా నూరి ఆ ముద్ద పాలతో కలిపి లోపలికి ఇచ్చిన రక్తవాంతి కట్టును .

*  నరికినప్పుడు ఏర్పడే దెబ్బ తగిలినప్పుడు యష్టిమధుకం యొక్క కషాయంతో దెబ్బని కడిగి వేడి నేతితో యష్టిమధుకం చూర్ణమును మెత్తగా ఉడికించి దెబ్బపై కట్టవలెను.

*  మూత్రం బంధించినప్పుడు యష్టిమధుకం , ద్రాక్షాపండ్లు కలిపి నూరి పాలతో కలిపి తాగించిన వాతం కిందికి ప్రసరించి మూత్రాన్ని జారిచేయును .

*  గొంతులో కఫం అడ్డుపడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుచున్నప్పుడు యష్టిమధుకం నోట్లో వేసుకొని చప్పరించుచూ రసం మింగుచున్న కఫం కరిగి ద్రవరూపంలో మారును . ఊపిరి అందని శ్వాసరోగమున శ్వాస మార్గమును మెత్తపరిచి శ్వాస సరిగ్గా ఆడునట్లు చేయును .

*  కడుపులో అల్సర్లు వల్ల కడుపులో మంట వస్తున్నచో యష్టిమధూకం చూర్ణం పొడిని మూడు గ్రాములు నీటిలో కలిపి రెండుపూటలా సేవించుచున్న కడుపులో మంట తగ్గును.

*  దగ్గు విపరీతంగా వస్తున్నపుడు యష్టిమధూకం చూర్ణం , తేనె కలిపి ఉండలుగా చేసి నోటి యందు ఉంచుకుని కొద్దికొద్దిగా రసాన్ని మింగుచున్న ఎటువంటి దగ్గులు అయినా తగ్గును. పొగ తాగడం వలన వచ్చే దగ్గుకి అద్భుతంగా పనిచేయును .

*  జ్వరం వచ్చు సమయంలో అతిమధుర చూర్ణం పాలతో గాని తేనెతో గాని సేవించుచున్న అన్ని రకాల జ్వరాలు నివారణ అగును.

*  ఎక్కిళ్లు ఆగకుండా వచ్చు సమయంలో అతిమధురం చూర్ణం రెండు టీస్పూనులు , అర స్పూన్ తేనె కలిపి సేవించుచున్న ఎలాంటి ఎక్కిళ్లు అయినా తగ్గిపోవును .

*  వేడి శరీరం కలవారికి ఈ అతిమధుర చూర్ణం వాడటం వలన చలవ చేసి వేడివలన వచ్చు సమస్యలు నివారణ అగును.

       యష్టిమధుకం మొక్కలో ప్రధానంగా వేరుని  ఔషధాల కొరకు ఉపయోగిస్తారు .  దీని చూర్ణం మీకు ఆయుర్వేద షాపులలో లభ్యం అగును.

 
  ఈ క్రింద వారి సౌజన్యం తో

                     

 
                కాళహస్తి వెంకటేశ్వరావు

            అనువంశిక ఆయుర్వేద వైద్యం

                     

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం