శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ- 2
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 52 🌹
✍. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము-7
🌴. ఖగోళముల వర్ణనము - 2 🌴
🌻. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమ- 2 🌻
ఆ పూజా మందిరములో నున్న శ్రీపాదులు వారు నరసావదానులకును, అతని ధర్మపత్నికిని హితోపదేషములు చేసిరి. ఈ హితోపదేషములు దత్త భక్తులన్దరకునూ ఎంతో ప్రయోజనకరమైనవి.
నరసావధానులకును, శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది.
🌻. నరసావధానులకు, వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ - నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు. 🌻
ప్రశ్న : నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా?
ఉత్తరం : నేను నేనే! పంచభూతాత్మకమైన యీ సృష్టిలోని ప్రతీ అణువణువునందునూ అంతర్లీనముగా నున్న ఆద్యశక్తిని నేనే!పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యండుననూ మాతృస్వరూపముగాను, పితృస్వరూపముగానూ ఉన్నది కూడా నేనే! సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే!
ప్రశ్న : అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా?
ఉత్తరం : నిస్సంశయముగా నేను దత్తుడనే! మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను.
ప్రశ్న : అయితే నీకు ఆకారమూ లేదు, గునములూ లేవు. అంతేకదా!
ఉత్తరం : ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే! గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే! సాకార, నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను, వాటికి అతీతుడను కూడా!
ప్రశ్న : అన్నీ నీవే అయినపుడు జీవులకు కష్ట సుఖములు ఎందుకు?
ఉత్తరం : నీలో, నీవూ నేనూ కూడ ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు. నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఃఖములు, పాప పుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలోవున్న 'నీవు' క్షీణదశకు వచ్చి నీలో ఉన్న 'నేను' ఉచ్ఛ దశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు దగ్గరయ్యెదవు. నాకు దగ్గరయ్యే కొలదీ నీ బాధ్యతా తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు.
ప్రశ్న : జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమన వచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజాము?
ఉత్తరం : నీవు వేరుగాను, నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమి లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరమూ ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమునూ, నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియూ, నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్త్వమని తెలుసుకొనిన యెడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును.
మోహము క్షయము నోన్డుతయే మోక్షము గనుక నీవు ద్వైతస్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచున్నపుడు, నీలోని అహంకారము నశిన్చినపుడు, నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మొహములేదు గనుక ఇది కూడ మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి, కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినపుడు 'నీవు' అనునది మిగులక 'నేను' అనునది మాత్రమే ఉందును గనుక మనస్సుచేత ఎంతమాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు.
కావున అద్వైతస్థితి లో నున్ననూ నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్ననూ, విశిష్టాద్వైతములో నున్ననూ, అద్వైతములో నున్ననూ బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే! అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైకవేద్యము మాత్రమే.
ప్రశ్న : అవధూత స్థితిలో నున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచున్డురు గదా! మరి నీవు కూడా అవధూతవా?
ఉత్తరం : కాదు. నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము, మరియు బ్రహ్మమే సర్వస్వమూ అనునది అవధూత అనుభవము. కాని నేను బ్రహ్మము. నేనే సర్వస్వమూ అనియెడి స్థితి నాది.
ప్రశ్న : అయిన యీ స్వల్పభేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు.
ఉత్తరం : సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు, బ్రహ్మానంద స్థితి ననుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనపుడు సంకల్పము లేదు. యీ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియెడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను.
నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన యెడల జన్మకు రావలసినదే! సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానందరూపము నాది, సంకల్పము నశించిన సత్య జ్ఞానానందరూపము వారిది.
ప్రశ్న : విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా! బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానయినపుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము?
ఉత్తరం : వేయించిన విత్తనములు మొలకెత్తక పోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టి కర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్యనిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment