గురువు యొక్క ఆవశ్యకత
• * యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ* • *తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనం * దేవునిపై ఎంతటిభక్తితత్పరత ఉంటుందో గురువుపైనా అంతటి భక్తి తన్మయత గల మహాత్మునికే నిగూఢమైన వేదార్థాలు కరతలామలకం అవుతాయి’ అని శ్రుతి వాక్యం. మానవజన్మ, మోక్షాపేక్ష, సద్గురుసేవ ఈ మూడూ దుర్లభమైనవని, ఈశ్వరుని అపారకరుణ వల్ల తప్ప ఇవి లభించవని ఆదిశంకరుల ‘వివేకచూడామణి’ చెబుతోంది. ధనం కంటే బంధువులెక్కువ. వారి కంటే దేహం ఎక్కువ. దేహం కంటే ధర్మం ఎక్కువ. ధర్మం కంటే దేవుడు ఎక్కువ. దేవునికంటే సద్గురువు ఎక్కువ. ‘గురు’ అను రెండు అక్షరాలు అమృత సాగరం వంటివి. ఆ అమృత సాగరంలో మునకలు వేసినవారికి ఈ సృష్టి అంతా గురు రూపమే. మనసులో గురు ధ్యానం చేసేవాడు సర్వేసర్వత్రా పూజనీయుడవుతాడు. పరమ నిష్ఠా గరిష్ఠుడైనా సద్గురు సేవ చేయనిదే పునీతుడుకాడు. గురుబోధ కానిదే ద్వైతము తొలగదు. జ్ఞానము కలుగదు. ఆత్మసిద్ధికి గురువు అవసరమా? అన్న ప్రశ్నకు.... ‘బోధ, శ్రవణ, ధ్యానాదులకన్నా ఎక్కువగా గురువుయొక్క అనుగ్రహమే ఫలితానిస్తుంది. శక్తిమంతమైన మహర్షుల సన్నిధిలో దుర్బల మనస్కులు కూడా శక్తిమంతులవుతారు’ అని భగవాన్ ...