గురువు యొక్క ఆవశ్యకత
• *యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ*
• *తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనం*
దేవునిపై ఎంతటిభక్తితత్పరత ఉంటుందో గురువుపైనా అంతటి భక్తి తన్మయత గల మహాత్మునికే నిగూఢమైన వేదార్థాలు కరతలామలకం అవుతాయి’ అని శ్రుతి వాక్యం.
మానవజన్మ, మోక్షాపేక్ష, సద్గురుసేవ ఈ మూడూ దుర్లభమైనవని, ఈశ్వరుని అపారకరుణ వల్ల తప్ప ఇవి లభించవని ఆదిశంకరుల ‘వివేకచూడామణి’ చెబుతోంది.
ధనం కంటే బంధువులెక్కువ. వారి కంటే దేహం ఎక్కువ. దేహం కంటే ధర్మం ఎక్కువ. ధర్మం కంటే దేవుడు ఎక్కువ. దేవునికంటే సద్గురువు ఎక్కువ.
‘గురు’ అను రెండు అక్షరాలు అమృత సాగరం వంటివి.
ఆ అమృత సాగరంలో మునకలు వేసినవారికి ఈ సృష్టి అంతా గురు రూపమే. మనసులో గురు ధ్యానం చేసేవాడు సర్వేసర్వత్రా పూజనీయుడవుతాడు.
పరమ నిష్ఠా గరిష్ఠుడైనా సద్గురు సేవ చేయనిదే పునీతుడుకాడు. గురుబోధ కానిదే ద్వైతము తొలగదు. జ్ఞానము కలుగదు.
ఆత్మసిద్ధికి గురువు అవసరమా? అన్న ప్రశ్నకు....
‘బోధ, శ్రవణ, ధ్యానాదులకన్నా ఎక్కువగా గురువుయొక్క అనుగ్రహమే ఫలితానిస్తుంది. శక్తిమంతమైన మహర్షుల సన్నిధిలో దుర్బల మనస్కులు కూడా శక్తిమంతులవుతారు’ అని భగవాన్ రమణులు సమాధానమిచ్చారు.
ఉత్తమవర్గానికి చెందిన శిష్యులు, గురువు వద్ద పరిపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా, దానిని నిరంతర సాధనతో నిలబెట్టుకుంటారు.
గురువు దృద్దీక్షతో చేపల్లాగా.. కేవలం తన చూపుతో శిష్యులను ధన్యుల్ని చేయగలడు.
మనోదీక్షతో కూర్మమువలె శిష్యుని తలంచి ఆవరణ భంగ మొనర్వగలడు.
స్పర్శదీక్షతో పక్షుల తరహాలో.. కేవలం తన స్పర్శతో శిష్యులను ధన్యులను చేయగలడు.
స్వానుభవముగల గురుముఖము నుండి జ్ఞానము గ్రహింపవలయునుగాని, కోటి గ్రంథములు చదివినా సిద్ధించదు. మరే ఇతర మార్గంలోనూ సిద్ధించదు.
గురుసేవతోనే దుఃఖనివృత్తి, పరమానంద ప్రాప్తి.
గురువులు ఎనిమిది రకాలు. బోధకుడు, వేదకుడు, నిషిద్ధుడు, కామ్యకుడు, సూచకుడు, వాచకుడు, కారణుడు, విహితుడు. వీరిని అష్టవిధ గురువులు అంటారు. వీరిలో.. శాస్త్ర శబ్దార్థాలను బోధించేవాడు ‘బోధన గురువు’. తత్వాన్ని దర్శింపజేయువాడు ‘వేదక గురువు’. వశ్యాకర్షణాది అష్టకర్మలచే ఇహ, పర లోకాలయందు ఖేద, మోదాలను ఇచ్చేవాడు ‘నిషిద్ధ గురువు’. పుణ్యకర్మోపదేశము చేత ఇహలోక, పరలోక సౌఖ్యములనిచ్చేవాడు ‘కామ్యక గురువు’. వివేక గుణం చేత శమదమాది సద్గుణములు కలుగజేసేవాడు ‘సూచక గురువు’. విషయాల యందు వైరాగ్యం, ఆత్మయందు అనురాగం కలిగించువాడు ‘వాచక గురువు’. ‘తత్త్వమసి’ మొదలుగా గల మహావాక్యాలచే జీవ బ్రహ్మైక్య జ్ఞానం కలుగజేసేవాడు ‘కారణ గురువు’. సకల సంశయాలనూ నివారించి నిత్యముక్తిని ఘటింపజేయువాడు ‘విహితగురువు’.
Comments
Post a Comment